newsseals.com

ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానికి కీలక పాత్ర

August 9, 2026 · VijayaBhaskar

హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థలో చేనేత , వస్త్ర పరిశ్రమ కీలకమైన భాగమని అన్నారు కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి. ఇది కోట్లాది మందికి ప్రత్యక్ష , పరోక్ష ఉపాధిని కల్పిస్తూ విదేశీ మారకద్రవ్య ఆర్జనకు గణనీయంగా దోహద పడుతోందని అన్నారు. చేనేత కార్మికులకు ఈ రంగంతో సంబంధం ఉన్న ఇతరులకు శుభాకాంక్షలు తెలిపారు. వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని , ‘5F’ విధానాన్ని (ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్ ,ఫ్యాషన్ టు ఫారిన్ మార్కెట్స్) అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటని, దేశ వ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మందికి ఇది ఉపాధినిస్తోందని మంత్రి తెలిపారు.

భారతదేశాన్ని ప్రపంచ స్థాయి వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా (గ్లోబల్ టెక్స్‌టైల్ హబ్) తీర్చిదిద్దే లక్ష్యంతో, 2030 నాటికి వస్త్ర ఎగుమతులను రూ. 9 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని అన్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం, PM MITRA పార్కులు, జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం, ముడి సరుకుల సరఫరా పథకం , చేనేత కార్మికుల కోసం ముద్రా (MUDRA) పథకం వంటివి కార్మికులకు ఆధునిక మగ్గాలు, ముడి సరుకులు, పని ప్రదేశాలు (షెడ్లు), డిజైన్ అభివృద్ధి, మార్కెటింగ్ సహాయం, రుణాలు , సామాజిక భద్రతను కల్పిస్తున్నాయని ఆయన వివరించారు. సాంప్రదాయ పద్ధతులు . ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ వరంగల్ జిల్లాలో ‘PM MITRA మెగా టెక్స్‌టైల్ పార్క్’ను ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్డి తెలిపారు

Related News