newsseals.com

ఇక నెలవారీ పోలీసు పెర్ఫార్మెన్స్ రిపోర్టు

August 13, 2026 · VijayaBhaskar

అమ‌రావతి : శాంతి భద్రతల విషయంలో ఏపీ అత్యుత్తమ రాష్ట్రంగా ఉండాలన్నదే లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నేర నిర్ధారణ రేటు పెరిగితే నేరాలు తగ్గుతాయి. పోలీసులు దర్యాప్తు చేసి విజయం సాధించిన కేసుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం పూర్తి స్థాయిలో అమలు కావాలి. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను ప్రోత్సహిస్తున్నారు. గతంలో మద్యం తాగించేవారు, ఇప్పుడు గంజాయి మత్తులో వీరంగం చేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల సాయంతో నేరస్తులుగా మారుతున్నారు. టెక్నాలజీ నేరస్తులను పట్టిస్తోంది, అదే సమయంలో నేరాలు పెంచుతోంది. బ్యాలెన్సింగ్, ప్రాపర్ పోలిసింగ్ ఉండాలి. పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం, సంఘ విద్రోహ శక్తులకు భయం కలగాలి.

రాష్ట్ర అభివృద్ధితో పాటు శాంతిభద్రతలు కూడా కీలకం. అప్పుడే సుపరిపాలన సాధ్యం. డీజీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకూ పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక నుంచి ప్రతీ నెలా పోలీసు పెర్ఫార్మెన్సు రిపోర్టును విడుదల చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీస్ సహా వివిధ అంశాలను ప్రజలకు వివరిద్దాం. అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1200 పోలీసు స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సహా శాంతిభద్రతలు, ట్రాఫిక్, జీఆర్పీ సహా వివిధ విభాగాలకు చెందిన 1650 మంది అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, శాంతి భద్రతల అదనపు డీజీ ఎన్. మధుసూధన రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, ఈగల్ టాస్క్ ఫోర్సు ఐజీ రవికృష్ణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related News