newsseals.com
DEVOTIONAL

ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

Posted by: VijayaBhaskar August 13, 2026
newsseals-TTD

తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు, శ్రీ గోవింద భట్టర్‌ (ఎంబార్), శ్రీ దాశరథి (ముదళియాండాన్) వారి జీవితం, ఆధ్యాత్మిక సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం, ఆలయ ఆచార–సంప్రదాయాల పరిరక్షణలో వారి విశిష్ట పాత్రపై సదస్సులో పరిశోధనాత్మక చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 25 మంది పరిశోధకులు, పండితులు సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయ వికాసంలో ఆచార్యుల కృషి, ఆధ్యాత్మిక సేవలపై లోతైన చర్చలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండ‌గా ఆగస్టు 17న ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామివారి మంగళా శాసనాలతో సదస్సు ప్రారంభమవుతుంది. మూడు రోజులపాటు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సు కొనసాగుతుంది.శ్రీమన్నాథమునుల శిష్య పరంపరలో ప్రముఖులైన ఆచార్య పుండరీకాక్షులు ఆళ్వారుల నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ సంప్రదాయాన్ని వైష్ణవ దివ్యదేశాల్లో వ్యవస్థీకృతంగా విస్తరింపజేసి, శాశ్వత రూపాన్ని కల్పించారు. వారు నెలకొల్పిన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది

భగవద్‌ రామానుజులు, శ్రీ గోవింద భట్టర్‌ (ఎంబార్) తిరుప్పుట్కుళి గురుకులంలో సహాధ్యాయులుగా విద్యాభ్యాసం చేశారు. అనంతరం అలిపిరిలో తిరుమల నంబి వద్ద ఏడాది పాటు శ్రీరామాయణ కాలక్షేపాన్ని శ్రవణం చేశారు. శ్రీ రామానుజులు తమ జీవితంలో మూడుసార్లు తిరుమలను దర్శించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని పలు ఆరాధనా విధానాలు, ఆచార–సంప్రదాయాలను వ్యవస్థీకరించినట్లు వైష్ణవ సంప్రదాయంలో విశేషంగా పేర్కొంటారు.శ్రీ గోవింద భట్టర్‌ (ఎంబార్) శ్రీ రామానుజుల మేనల్లుడిగా ఆయనకు సన్నిహితంగా ఉంటూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, రామానుజ దర్శనాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

శ్రీ దాశరథి (ముదళియాండాన్) శ్రీ రామానుజుల మేనల్లుడిగా శ్రీరంగం దేవస్థాన నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శ్రీ వైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు విశేష సేవలందించారు. శ్రీ రామానుజుల శఠకోపం అనేక దేవాలయాల్లో ముదళియాండాన్ పేరుతో పూజలందుకోవడం ఆయనకు లభించిన విశిష్ట గౌరవానికి నిదర్శనం.