హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

హైదరాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ ప్రాంగణంలో జరిగిన వివక్షపూరిత “శుద్ధీకరణ” కార్యక్రమాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ మార్చ్ , సత్యాగ్రహం చేపట్టాలని నిర్ణయించారు.
హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే వేదికపై పాల్గొన్నందున ఆ ప్రాంగణం “అపవిత్రమైందంటూ” కొందరు హిందూ మితవాద సంస్థలు గంగా జలంతో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించిన ఘటనను ఏఐసీసీ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య వివక్ష పూరిత, వెనుకబడిన ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని, భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి విలువలకు విరుద్ధమని పేర్కొంది.
ఈ ఘటనకు నిరసనగా నిర్వహించే మార్చ్‌ను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలిపింది, అనంతరం మహాత్మా గాంధీ లేదా డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యాగ్రహం నిర్వహించాలి. ఈ సత్యాగ్రహం ద్వారా వివక్ష, అంటరానితనం, అసమానతలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదనే స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో PCC, DCC, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు, అనుబంధ సంఘాలు, విభాగాలు, సెల్స్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు , కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది.