newsseals.com
News

కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

Posted by: VijayaBhaskar August 14, 2026
newsseals-SSavitha

అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే పలువురు నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.

అర్హులైన నేతన్నలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. చేనేతల సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. అర్హులైన నేతన్నల కుటుంబాల్లో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, ఏమైనా అనుమానాలు ఉంటే సమీపంలో చేనేత, జౌళి శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి సవిత సూచించారు.