రాచరిక పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులన్నీ చేస్తున్నాడని మండిపడ్డారు. ఇవాళ ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఎవరూ హోమ్ శాఖను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోరన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హోమ్, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను తన వద్దే పెట్టుకొని పోలీసులను, HMDAను కంట్రోల్ చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వం గురించి ప్రతికూలంగా రాస్తే లైసెన్సులు రద్దు చేస్తామని, అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వమని పత్రికలను, చానళ్లను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బొంరాస్‌పేట్ రైతులు ఎంత తీవ్రంగా పోరాడుతున్నా మీడియా పట్టించుకోక పోవడంతో రైతులంతా రూ. 5,000, రూ. 10,000 చందాలు వేసుకొని పేపర్‌లలో ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొందన్నారు .రేవంత్ రెడ్డి సోదరుడైన అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్’ (Tesseract) అనే కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన భూమిని అత్యంత తక్కువ ధరకు కట్టబెట్టిన వ్యవహారంపై తాము లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఆర్ఎస్పీ.