newsseals.com
News

మత్స్యకారుల గల్లంతైన ఘటనపై డిప్యూటీ సీఎం ఆరా

Posted by: VijayaBhaskar August 18, 2026
newsseals-PawanKalyan

అమరావ‌తి : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల క్షేమంపై ఆరా తీశారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సైతం ఇవాళ మ‌త్స్య‌కారుల గ‌ల్లంతుపై వాక‌బు చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మరం చేయాల‌ని ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ నుంచి బయలు దేరిన బోటు ఆగస్టు 13వ తేదీ నాటికి తిరిగి చేరుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకు బోటు ఆచూకీ లభించలేదు.

ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు కోసం ఇప్పటికే మెరైన్ పోలీసు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖలతోపాటు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మత్స్యకారుల ప్రాణల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.