అమరావతి : బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీయేనని మంత్రి సవిత తెలిపారు. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించనవారేనన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, తన తండ్రి ఎస్.రామచంద్రారెడ్డి వంటి ఎందరో బీసీ నేతలు అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ప్రోత్సహంతో రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారని మంత్రి సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ బీసీలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షపాతమేనని జగన్ కక్షగట్టారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందన్నారు.
రిజర్వేషన్లలో కోత వల్ల 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి నారా లోకేశ్ తన పాదయాత్రలో గుర్తించారన్నారు. అధికారంలోకి రాగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాడే హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు సైతం బీసీలకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ బిల్లును రూపొందించామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నామన్నారు. బీసీలకు మరోసారి రాజకీయ పట్టం కల్పిస్తున్న సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.






