6,206 నిర్వాసితులకు రూ. 768 కోట్లు : సీఎం

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం , నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరేలా వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం కానుందన్నారు. ఆగస్టు 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి నీళ్లు విడుదల చేస్తామని ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతలో రూ.250 కోట్ల పరిహారం చెక్కును సీఎం చంద్రబాబు అందించారు. దీంతో ఇప్పటి వరకూ 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు పరిహారాన్ని సీఎం చేతుల మీదుగా అందించారు. 48 రోజుల్లోనే నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.768 కోట్లను చెల్లించింది.
నిర్వాసితులకు మరో రూ.132 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. వెలిగొండ నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆయా జిల్లాల ప్రజల 30 ఏళ్ల కలను సుసాధ్యం చేసి చూపించాం. సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, తాగునీరు ఇవ్వాలని కోరారు. 1996లో నేనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేసి… 2026లో ప్రారంభిస్తున్నాను. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నీళ్లు రాలేదు. చాలా పొదుపుగా నీటిని వినియోగించుకోవాల్సి ఉందని రైతులకు సూచించారు. ఇబ్బందులు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించామన్నారు. 2021లోనే దీనిని పూర్తి చేసి నీరివ్వాల్సి ఉన్నా గత పాలకులు చేసిన డ్రామాలతో అది సాధ్యం కాలేదన్నారు.