హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం , తన తండ్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇవాళ తెలంగాణను దేశంలోనే అన్ని రంగాలలో టాప్ లో నిలబెట్టేలా చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న కేసీఆర్ సంకల్పం దిశగా మరో ముందడుగు పడిందని తెలిపారు. ఆదిలాబాద్ ఐటీ టవర్ ఇప్పుడు సిద్ధంగా ఉండటంతో హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్లో కూడా ఐటీ పరిశ్రమ విస్తరించనుందని అన్నారు కేటీఆర్. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఆదిలాబాద్ ఐటీ టవర్ ఆదిలాబాద్ , దాని పరిసర ప్రాంతాలలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకు రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము ఐటీ టవర్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు కేటీఆర్. అన్ని రకాల వసతులను కల్పించడం ద్వారా తాము ప్రముఖ కంపెనీలను ఆకర్షించామని పేర్కొన్నారు. వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం , కరీంనగర్ వంటి పట్టణాల్లో ఐటీ టవర్లను బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభించడం జరిగిందని తెలిపారు కేటీఆర్. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నిర్వహణలో విఫలమవుతోందన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐటీ టవర్లలో అన్ని వసతులను కల్పించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చూడటానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.





