newsseals.com

కరువు, ఎల్‌నినో పరిస్థితులపై స‌బ్ క‌మిటీ ఏర్పాటు

October 20, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో ప్ర‌స్తుతం చోటు చేసుకున్న క‌రువు, ఎల్ నినో ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ విష‌యాన్ని సీఎస్ వెల్ల‌డించారు. రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించి, వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను సిఫార్సు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా నియమితులయ్యారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక ఆహ్వానితుడిగా సీనియర్ అధికారి కె. రామకృష్ణారావును నియమించగా, ప్రణాళిక శాఖ కార్యదర్శి ఈ ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరించనున్నట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఈ మంత్రివ‌ర్గ ఉప సంఘం రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, కరువు , ఎల్‌నినో ప్రభావాలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలపై సిఫార్సులు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. మ‌రో వైపు ఇప్ప‌టికే క‌రువు దెబ్బ‌కు జ‌నం అల్లాడుతున్నారు. రాబోయే ఎండా కాలం నీళ్లంద‌ని ప‌రిస్థితి దాపురించేలా ఉంది.

Related News