newsseals.com
DEVOTIONAL

బతుకమ్మ వేడుకలకు వేదికలుగా చెరువులు

Posted by: VijayaBhaskar October 20, 2026
newsseals-Bathukamma

హైద‌రాబాద్ : దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఇవాల్టితో ముగుస్తాయి. ఉత్స‌వాలలో భాగంగా హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు బతుకమ్మ వేడుకలకు వేదికలుగా నిలిచాయి. కూకట్‌పల్లి నల్ల చెరువుతో పాటు, IDL చెరువు, మాదాపూర్‌లోని సున్నం చెరువు, అంబర్‌పేట బతుకమ్మ కుంట, ఉప్పల్ నల్లకుంట చెరువుల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను ఆడుకున్నారు. కూకట్‌పల్లి నల్ల చెరువులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న కొలనులో నీటిని నింపి, అందులో బతుకమ్మలను ఉంచడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. గణేశ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా తవ్విన కూకట్‌పల్లి IDL చెరువు వద్ద కూడా బతుకమ్మ వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. అంబర్‌పేట బతుకమ్మ కుంట , ఉప్పల్ నల్లకుంట చెరువుల వద్ద కూడా ఇదే తరహాలో మహిళలు బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

కూకట్‌పల్లి నల్ల చెరువు వద్ద HYDRA DRF సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాకుండా, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారు స్వయంగా బతుకమ్మలను తీసుకువెళ్లి చెరువులో ఉంచడంలో సహాయపడ్డారు. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఎండిపోయిన తరుణంలో, హైడ్రా అభివృద్ధి చేసిన ఈ చెరువుల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మహిళలకు ఎంతో ఊరటనిచ్చాయి. గతంలో చెరువుల వద్ద పరిస్థితులు బతుకమ్మ ఆడటానికి అనుకూలంగా ఉండేవి కావు, అప్పట్లో కేవలం నీటి వనరుల్లో బతుకమ్మలను వదలడం మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు బతుకమ్మ వేడుకలకు వేదికలుగా మారడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. చెరువు ఒడ్డున బతుకమ్మ ఆడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.