newsseals.com

మోహన కృష్ణ ఇంద్రగంటితో జతకట్టిన రోషన్ మేకా

November 12, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ మేకా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మోహ‌న కృష్ణ ఇంద్ర‌గంటితో జ‌త‌క‌ట్టాడు. పాన్-ఇండియా సూపర్ హీరో చిత్రంలో రోషన్ మేకా, రేఖా పాండే , వినయ్ రాయ్ నటించనున్నారు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. రోషన్ మేకా ఇప్పటికే ‘పెళ్లి సందడి’ ‘ఛాంపియన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన ‘ఏమో ఏమో ఇది’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నారు. తాజాగా క్లాసిక్ ప్రేమకథలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటితో తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం చిత్ర బృందం అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. ఒక సూపర్ హీరో ప్రపంచం సాకారం కాబోతోంది. కొత్త సూపర్ హీరో కోసం ప్రపంచం వేచి చూస్తోంది అని పేర్కొన్నారు మూవీ మేక‌ర్స్.

అశోక క్రియేషన్స్ తమ మూడవ నిర్మాణంగా ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో రోషన్ మేకాతో పాటు రేఖా పాండే, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్ప , సునీల్ బలుసు ఈ రోజు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. రోషన్ తండ్రి శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, ముప్ప వెంకయ్య చౌదరి కెమెరాను స్విచ్ ఆన్ చేసి, చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. మోహన కృష్ణ ఇంద్రగంటికి ప్రత్యేకమైన కథన శైలికి, సూపర్ హీరో కాన్సెప్ట్ తోడవ్వడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి పి.జి. విందా ఛాయాగ్రహణం అందించనుండగా, గౌర హరి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని అత్యున్నత స్థాయి యాక్షన్ సన్నివేశాలకు అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ లీ విట్టేకర్ ,రామకృష్ణలు నృత్య దర్శకత్వం వహించనున్నారు.

Related News