భూసేకరణ పరిహారం చెల్లించేందుకు నిధులు లేవు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవని, ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ బాంబు పేల్చారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా. ఈ విషయాన్ని హైకోర్టుకు వెల్లడించారు. ఇప్పటికే నిధులు పంపిణీ చేయక పోవడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపై సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేయాలని ఆదేశించింది . దీంతో ఆయన చర్చనీయాంశంగా మారారు. తాజాగా భూ సేకరణ పరిహారం పంపిణీకి సంబంధించి దాఖలైన కేసును విచారించింది కోర్టు. ఈ సందర్బంగా ముఖ్య కార్యదర్శి హైకోర్టుకు పరిహారం చెల్లించేందుకు తమ వద్ద ఆశించిన మేర నిధులు లేవని పేర్కొన్నారు. రూ. 40,000 కోట్ల విలువైన టోకెన్లు జారీ చేశామని, కానీ ప్రస్తుతం చెల్లించే స్థితిలో లేమని చేతులెత్తేశారు సందీప్ కుమార్ సుల్తానియా.
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించినప్పటికీ, పరిహారం అందక పోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పరిహారం చెల్లించక పోవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు దీనిపై నిన్న జరిగిన విచారణకు వర్చువల్ పద్ధతిలో హాజరైన సుల్తానియా, టోకెన్లు జారీ చేశామని, అయితే ప్రస్తుతం చెల్లించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. దీనికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, ఇది తమ అసమర్థత వల్లే జరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు.
కోర్టు పరిధిలో ఉన్న రూ. 51 కోట్ల పరిహారాన్ని 12 వారాల్లోగా చెల్లించాలని, అలాగే ఒక్కొక్కరికి ఎంత పరిహారం అందాలో స్పష్టంగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది