newsseals.com
News

భిక్షాట‌న ర‌హిత న‌గ‌రంగా హైద‌రాబాద్ : ఆర్వీ క‌ర్ణ‌న్

Posted by: VijayaBhaskar November 13, 2026
newsseals-GHMC

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ ) క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని భిక్షాట‌న ర‌హిత న‌గ‌రంగా మార్చాల‌ని అన్నారు. కీలక పౌర, పరిపాలనా కార్యకలాపాలను సమీక్షించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్. అదనపు కమిషనర్ (క్రీడలు) పి. ఉదయ్ కుమార్, కలిసి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు , ప్రాజెక్ట్ ఆఫీసర్లతో ఆస్తి పన్ను వసూళ్లు, స్వయం సహాయక బృందాల (SHG) ఏర్పాటు, ఆశ్రయ గృహాలు, నిరాశ్రయుల పునరావాసం, ఓటర్ల జాబితా కార్యకలాపాల పురోగతిని సమీక్షించారు.

హైదరాబాద్‌ను భిక్షాటన రహిత నగరంగా మార్చేందుకు సమన్వయ ప్రయత్నాలతో రోజువారీ ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను సాధించాలని అన్నారు క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్. ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అన్నారు. అంతే కాకుండా స్వయం సహాయక బృందాల ఏర్పాటుపై ఫోక‌స్ పెట్టాల‌ని ఆదేశించారు. రోడ్ల పక్కన నివసిస్తున్న నిరాశ్రయులు, బలహీన వర్గాల వారిని గుర్తించాల‌ని, వారికి నిర్దేశిత ఆశ్రయ గృహాలలో పునరావాసం కల్పించాలని కమిషనర్ అన్నారు.

జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకోవడంలో దోహద పడిన పారిశుధ్య సిబ్బంది, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు , అదనపు కమిషనర్ (పారిశుధ్యం)ను ఆయన అభినందించారు. పరిశుభ్రమైన హైదరాబాద్ కోసం ఇదే విధమైన బృంద స్ఫూర్తిని, నిబద్ధతను కొనసాగించాలని ఆయన వారిని కోరారు.