newsseals.com
BUSINESS

ఏపీలో కొత్తగా రూ.700 కోట్ల పెట్టుబడులకు డిక్సన్ ఓకే

Posted by: VijayaBhaskar November 13, 2026
newsseals-NaraLokesh

విశాఖపట్నం: డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ , చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పంకజ్ శర్మతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో శుక్ర‌వారం సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ తో భేటీ అనంతరం తిరుపతి – EMC-IIలో కొత్తగా రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సుముఖత వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్ర యువతకు 2,300 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. భారత దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ ప్లాంట్ అయిన డిక్సన్ తిరుపతి హబ్… కొప్పర్తి, తిరుపతిలో విస్తరణ ప్రణాళికలను రూపొందించడంపై మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. డిక్సన్-ఇన్వెంటెక్ JV కింద ల్యాప్ టాప్, డెస్క్ టాప్, సర్వర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు.

మంత్రి నారా లోకేష్ తో భేటీ అనంత‌రం డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ మాట్లాడారు. డిక్సన్ టెక్నాలజీస్ కు భారతదేశంలోనే అతిపెద్ద LED టీవీ ప్లాంట్ (షియోమి, ఇతర బ్రాండ్లు) ఇన్-హౌస్ LCM లైన్ తో 2018 నుంచి తిరుపతిలో ఉందని తెలిపారు. కడప జిల్లా కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ (సీపీ ప్లస్)ను రూ.450 కోట్లతో విస్తరిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా కొత్త‌గా 7 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్ల‌డించారు. దీనికి ఇప్పటికే ఎస్ఐపీబీ ఆమోదం లభించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పెట్టుబ‌డిదారుల కోసం పెట్టుబ‌డిదారుల రక్ష‌ణ చ‌ట్టం తీసుకు వ‌స్తున్న‌ట్లు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు.