newsseals.com
News

పేద‌ల కోసం మెరుగైన వైద్యం : సీఎం

Posted by: VijayaBhaskar November 14, 2026
newsseals-CM

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఆసుపత్రికి వచ్చే ఏ పేద కుటుంబం కూడా చికిత్స కోసం అప్పుల ఊబిలో కూరుకు పోకూడదని అన్నారు. చికిత్స కోసం వారు రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదని స్ప‌ష్టం చేశారు. ఈ లక్ష్యంతోనే తాము ఆరోగ్య శాఖపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. శాఖను ప్రక్షాళన చేయడమే కాకుండా వ్యవస్థాగత మార్పులను కూడా తీసుకు వస్తున్నామని తెలిపారు సీఎం. TIMS ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి , NIMS విస్తరణ పనులను జూన్ 2వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత ఆరోగ్య‌, ఆర్ అండ్ బి శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.

ఇవాళ సీఎం ఆధ్వ‌ర్యంలో ఆరోగ్య శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మీక్ష‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌తో పాటు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కొత్త ఉస్మానియా ఆసుపత్రిని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య బీమా పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం జ‌రిగింద‌న్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల సంఖ్యను 30,000 నుండి 38,000కు పెంచడంతో పాటు 13,401 మంది వైద్య సిబ్బంది నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మరో 5,640 మంది నియామక ప్రక్రియ కొనసాగుతోంద‌ని చెప్పారు.

ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందాలన్నారు. చికిత్స కోసం ఎవరూ తమ ఆస్తులను అమ్ము కోవాల్సిన దుస్థితి రాకూడదన్నారు.