newsseals.com
News

విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవాలి

Posted by: VijayaBhaskar November 16, 2026
newsseals-Dammodara

హైదరాబాద్ : విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని (స్కిల్ డెవలప్‌మెంట్) పెంపొందించు కోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకు వస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. హైద‌రాబాద్ లోని జేఎన్టీయూ సుల్తాన్‌పూర్‌ ఆడిటోరియంలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించి ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలో ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా SKSS ఏజెన్సీ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ జాబ్ మేళాలో సుమారు 1,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన ఎస్కేఎస్ఎస్ సంస్థ ప్రతినిధులను దామోద‌ర రాజ న‌ర‌సింహ‌ అభినందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం యువ‌తీ యువ‌కుల‌కు మేలు చేకూర్చేలా ఉపాధి క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు మంత్రి.