newsseals.com

కొత్తూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం

November 17, 2026 · VijayaBhaskar

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా లోని కొత్తూరు లో జెఈహెచ్ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంగ‌ళ‌వారం రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ప్రారంభించారు. ఈ కేంద్రం విమానాలు, ఏరో-ఇంజిన్ల తయారీ, నిర్వహణలో ఉపయోగించే ప్రత్యేకమైన పరికరాలు, ఫిక్స్చర్లను తయారు చేస్తుంది. ఇప్పటి వరకు, భారతదేశం ఇటువంటి పరికరాల కోసం చాలా వరకు కొన్ని ప్రత్యేక సరఫరాదారులపై లేదా దిగుమతులపై ఆధార పడింది. ఇక్కడ ఈ సామర్థ్యాలను నిర్మించడం వల్ల ఆ ఆధార పడటాన్ని తగ్గించి, మన స్వంత తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి సహాయ పడుతుందని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు.

హైదరాబాద్‌ను ప్రెసిషన్ ఇంజనీరింగ్‌కు ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం కోరుకుంటోంద‌ని చెప్పారు. తెలంగాణకు మరిన్ని అధునాతన తయారీ కార్యకలాపాలను తీసుకు రావడం, ఈ అభివృద్ధిలో మన స్థానిక పరిశ్రమలు , యువత భాగమయ్యేలా చూడటంపై మా దృష్టి ఉందని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా సంస్థ‌ను ఏర్పాటు చేసి విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్న య‌జమానులైన విశాల్, వెంక‌టేష్‌, జెఈహెచ్ ఏరోస్పేస్ బృందానికి అభినందనలు తెలిపారు మంత్రి. ఇదే క్ర‌మంలో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో డిసెంబ‌ర్ లో ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా ఏర్పాటు చేయ‌బోయే తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు హాజ‌రు కావాల‌ని కూడా కోరారు.

Related News