newsseals.com
News

ఆదాయ వ‌న‌రుల‌పై దృష్టి సారించాలి : సీఎం

Posted by: VijayaBhaskar November 26, 2026
newsseals-CM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఏపీని నెంబ‌ర్ వ‌న్ గా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, స్టాంపులు , రిజిస్ట్రేషన్లు, గనులు, రవాణా, మున్సిపల్ పరిపాలన , పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆదాయ వనరుల లీకేజీలు తగ్గాయని, వ్యవస్థాగత లోపాలు సరి దిద్దబడ్డాయని, దీని ఫలితంగా ఆయా శాఖల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరేలా చూడాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

అదే సమయంలో ప్రజలపై పన్నుల భారం పెంచకుండా లేదా కొత్త రుసుములను విధించకుండా చూడాల‌న్నారు. ప్రభుత్వ శాఖల్లో ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైన నిత్యావసర వస్తువుల ధరల భారం సామాన్యులపై ఏమాత్రం పడకూడదని అన్నారు సీఎం. ప్రభుత్వ చర్యలు వారికి ఉపశమనం కలిగించేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వినియోగదారులను కాపాడటం ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, పౌర‌స‌ర‌ఫార‌ల శా ఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.