నంది అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యులకు కంగ్రాట్స్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే నంది పురస్కారాలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రతిష్టాత్మక నంది అవార్డుల జ్యూరీ కమిటీలో సీనియర్ సినీ పాత్రికేయులకు చోటు దక్కడంపై తెలుగు సినీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. కమిటీ సభ్యులుగా ఎంపికైన పాత్రికేయులు వడ్డీ ఓం ప్రకాష్, నారాయణరాజు, వారణాసి లక్ష్మీనారాయణ, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, రాంబాబు వర్మ, హేమసుందర్, రవిచంద్రలకు సినీ విమర్శకుల సంఘం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. దశాబ్దాలుగా సినీ జర్నలిజానికి విశేష సేవలందించి, విలువైన విశ్లేషణల ద్వారా తమదైన ముద్ర వేసిన ఈ సీనియర్ పాత్రికేయులు నంది అవార్డుల ఎంపిక కమిటీకి నియమితులవడం పట్ల తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామని సంఘం పేర్కొంది.
వారి అనుభవం ప్రతిభను గుర్తించి, అర్హులైన కళాకారులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడంలో ఎంతగానో ఉపయోగప డుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సినీ విమర్శకుల సంఘం ఒక ప్రత్యేక అభినందన పోస్టర్‌ను విడుదల చేసి, కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. సినీ విమర్శకులకు, పాత్రికేయులకు వారు అర్హులైన గుర్తింపును ఇస్తున్నందుకు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వాన్ని అభినందించారు.