తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తాను ఓ రాజునని ఫీల్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్య హననం. పోలీసులను తన్నినా వాళ్లు వుల్టా గూండాలను ఏమీ అనక చేతులు ముడుచుకుని నిలబడడం జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు ఆర్ఎస్పీ. ఎక్కడనుండి ఎక్కడికి దిగజారారంటూ వాపోయారు. ఉదయం రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ డ్రామా చేసి, సాయంత్రం బవార్చి హోటల్ లో బిఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , అతని గూండాల గ్యాంగ్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు.
మెటా కంపెనీ ఆఫీస్ మీద దాడిని ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి సమర్థించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో కాంగ్రెస్ గూండాలు మరింత రెచ్చి పోయారంటూ మండిపడ్డారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు, ఆందోళన చేపట్టే హక్కు ఉంటుందన్నారు. ఇది కూడా తెలియకుండా ప్రవర్తించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత. పోలీసులు అంతా తెలిసి అడ్డుకోక పోవడం, హింసను ప్రేరేపించడమే తప్ప మరోటి కాదన్నారు. కాంగ్రెస్ గూండాలు 300 మంది సాయంత్రం నుండే గుమిగూడుతున్నా స్పెషల్ బ్రాంచ్ కు కానీ లేదా ఇంటలిజెన్స్ కు తెలవక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.