newsseals.com
News

ఎన్నిక ఏదైనా ఏపీలో కూట‌మికే ప్ర‌జలు ప‌ట్టం

Posted by: VijayaBhaskar November 28, 2026
newsseals-GaddeRammohanRao

అమ‌రావ‌తి : రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. తొలి విడత స్థానిక ఎన్నికల ఫలితాలు మరోసారి ప్రజల మనోభావాలను స్పష్టం చేశాయని చెప్పారు. ఈవీఎంలు, బ్యాలెట్లు, పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా ఎన్నికలు జరిగినా ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగానే ఉందని పేర్కొన్నారు. శ‌నివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో రకాల ఎన్నికల ఫలితాలు, ప్రజాభిప్రాయాలను చూశానని తెలిపారు. గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతులు ఇలా ఒక్కో వర్గంలో ఒక్కో అభిప్రాయం ఉండేదన్నారు. కానీ 2024 ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ నాయకత్వాన్ని తిరస్కరించాలన్న ప్రజల నిర్ణయం 2024 ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడైందన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లోనూ అదే ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తోందని చెప్పారు గ‌ద్దె రామ్మోహ‌న్ రావు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని తమ ఓటు ద్వారా మరోసారి చాటుతున్నారని పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధి నుంచి సంక్షేమం వరకు కూటమి పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగింద‌న్నారు. గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమై, అడుగడుగునా గోతులమయంగా మారాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రోడ్డు రూపురేఖలు మారిపోయాయన్నారు. ఒక ముఖ్యమంత్రి మారితే ఇంత మార్పు సాధ్యమా? అని సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్య పోతున్నారని తెలిపారు. ఇంకా చాలా రోడ్లు బాగు చేయాల్సి ఉన్నప్పటికీ, గత ఐదేళ్ల పాలనలో అనుభవించిన నరకాన్ని మళ్లీ చూడకూడదనే స్పష్టమైన అభిప్రాయం నేడు ప్రజల్లో బలంగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు.