newsseals.com
DEVOTIONAL

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఘ‌నంగా జ్యేష్ఠాభిషేకం

VijayaBhaskar July 24, 2026
newsseals-Jyestabhishekam

తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరా జస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ గోవింద రాజ స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి శతకలశ స్నపనం, మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా చేపట్టారు.

అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీటితో విశేష అభిషేకం చేసి, అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ ఏఈవో నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.