గంగమ్మ తల్లీ ఏపీని కరుణించు : నారా భువనేశ్వరి

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా మూడవ రోజున బుధవారం వసనాడులోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని, రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా తగినంత వర్షాలు కురిసేలా అనుగ్రహించమని ప్రార్థించారు.ఎల్ నినో’ ప్రభావం రాష్ట్రంపై పడకుండా, నీటి కొరత తలెత్తకుండా చూడాలని గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు తెలిపారు. దర్శనం చేసుకున్న అనంతరం నారా భువనేశ్వరి వసనాడు జిల్లా పరిషత్ (ZP) పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.
చెట్లు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. అలాగే, పాఠశాలలో కల్పిస్తున్న కనీస సౌకర్యాలు, విద్యా బోధన , మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నారా భువనేశ్వరి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హంద్రీనీవాతో కృష్ణా జలాలు కుప్పానికి తీసుకొచ్చి నీటి కష్టాలు తీర్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం ప్రజలు మరింత భారీ మెజారిటీతో సీఎం చంద్రబాబును గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందన్నారు. అనంతరం పెద బంగారుతనంలో హార్టికల్చర్ హబ్ ను సందర్శించారు. మహిళా రైతులు అనుసరిస్తున్న నూతన పంట విధానాలను పరిశీలించారు. ఒక్క పంటపైనే ఆధార పడకుండా కొత్త రకం పంటలు పండిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు .