విద్యార్థుల నిరసనలపై చర్చకు అమిత్ షా సిద్ధం

న్యూఢిల్లీ : కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన ప్రకటన చేశారు. విద్యార్థుల ఉద్యమం , దానికి సంబంధించిన కార్యకలాపాలపై సమగ్రమైన, వివరమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రెడీగా ఉన్నారని చెప్పారు. సోమవారం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటరీ కార్యకలాపాలకు ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తోందని ఆరోపిస్తూ, విద్యార్థుల సంబంధిత ఉద్యమాలపై సమగ్ర చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో హోం మంత్రి అధికారిక సమాధానం చెప్పేటప్పుడు చట్టసభ సభ్యులు అంతరాయం కలిగించ కూడదని ఆయన నొక్కి చెప్పారు.
అంతరాయం లేని పార్లమెంటరీ ప్రక్రియ ఆవశ్యకతను నొక్కి చెబుతూ అధికారిక ప్రకటనల సమయంలో అంతరాయాలు కలిగించవద్దని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ప్రతిపక్షానికి నేను చెప్పేది ఒక్కటే – చర్చ , సమాధానం జరుగుతున్నప్పుడు, హోం మంత్రి ప్రకటనను అడ్డుకునేలా ప్రతిపక్షం గందరగోళం సృష్టించ కూడదన్నారు కిరణ్ రిజిజు. వారు హోం మంత్రి , ప్రభుత్వం ఇచ్చే సమాధానాన్ని వినాలి. చర్చ మొదలైన తర్వాత, మనం దానిపై కూలంకషంగా చర్చించుకోవాలని సూచించారు . ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ హోం మంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించిన తర్వాత , జూలై 20 నాటి నిరసనల సందర్భంగా జరిగినట్లు ఆరోపించ బడుతున్న పోలీసు చర్యపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్ చేసిన తర్వాత కేంద్ర మంత్రి నుండి ఈ ప్రకటన వచ్చింది.