సెప్టెంబర్ లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట

న్యూఢిల్లీ : ఖాతాదారులు, వినియోగదారులకు కోలుకోలేని షాక్ తగలనుంది. వచ్చే నెల సెప్టెంబర్ లో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సంబంధించి సేవలకు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11, 28, 30 తేదీలలో సమ్మెలకు యుఎఫ్ బీ యు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. వారానికి ఐదు రోజుల పని విధానం, పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానాన్ని ఉపసంహరించు కోవడం , పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లను యూనియన్లు లేవనెత్తుతున్నాయి . తొమ్మిది బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సంఘాల ఉమ్మడి వేదిక అయిన ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రెండు విడతలుగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.
మొదటి సమ్మె సెప్టెంబర్ 11న జరగనుండగా ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె జరగనుంది. ఈ నిరసనల వల్ల ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలకు గణనీయమైన అంతరాయం కలుగుతుందని అంచనా. సెప్టెంబర్ చివరి నాటికి ఈ అంతరాయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 26 (నాల్గో శనివారం ), సెప్టెంబర్ 27 (ఆదివారం) తేదీలలో బ్యాంక్ శాఖలు ఇప్పటికే మూసివే యబడనున్నాయి. సెప్టెంబర్ 28, 29 , 30 తేదీలలో జరిగే మూడు రోజుల సమ్మెతో కలిపి వరుసగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం ఏర్పడుతుంది.