newsseals.com
SPORTS

తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

Posted by: VijayaBhaskar August 27, 2026
newsseals-GKishanReddy

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు. అందులో రూ.11.5 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సింథటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్ట్, మహిళలకోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలను కల్పించారని చెప్పారు. మరో రూ.18.5 కోట్లతో రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో క్రీడా సదుపాయాలను కల్పించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో 33 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మరో రూ.8.5 కోట్లను తెలంగాణలో క్రీడాభివృద్ధికి ఖర్చు చేశామన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఖేలో ఇండియా స్కీమ్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS), అసిస్టెన్స్ టు నేసనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్(ANSFs), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) స్కీమ్ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్.. టాప్స్ ప్రోగ్రామ్ సహాయంతో ఇవాళ భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడిస్తోంది. ఈ పథకం ద్వారా ఆమెకు అత్యాధునిక శిక్షణతోపాటుగా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని అనుభవం గడించేందుకు ప్రోత్సాహం లభించింది. తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా.. టాప్స్ కార్యక్రమం ద్వారా.. అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సపోర్టింగ్ స్టాఫ్ సహకారంతో.. ఒలింపిక్స్ మెడల్ సాధించింది. క్రీడారంగంలో ఆమె రాణిస్తున్న తీరును ప్రోత్సహిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మశ్రీ, 2020లో పద్మభూషణ్ అవార్డును అందించింది.

ఇలాంటి క్రీడాకారులెందరికో.. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 2014కు ముందు మొత్తం 23 ఒలింపిక్స్ ఎడిషన్లలో.. 23 పతకాలు సాధించగా.. 2014 నుంచి 2024 వరకు మూడు ఎడిషన్లలో 15 పతకాలు సాధించాం. పారాలింపిక్స్ లోనూ.. 2014కు ముందు దేశం కేవలం 8 పతకాలు సాధించగా.. 2014 నుంచి 2024 పారాలింపిక్స్ లో.. 52 పతకాలు సాధించాం. 2014కు ముందు దేశంలో స్పోర్ట్స్ బడ్జెట్ రూ.1,219 కోట్లుండగా.. 2025-26లో ఇది రూ.3,794 కోట్లకు పెరిగింది. దేశంలో 2014కు ముందు రూ.191 కోట్ల విలువైన 38 స్పోర్ట్స్ ప్రాజెక్టులుండగా.. ఈ 12 ఏళ్లలో.. 350 స్పోర్ట్స్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.3,181 కోట్లు ఉంటుంద‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.