శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత

తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు . సమావేశంలో అతిథుల వివరాల నమోదు, అనుమతి లేని వ్యక్తుల ప్రవేశ నియంత్రణ, గెస్ట్ హౌస్ సిబ్బంది పూర్తి వివరాల సేకరణ, వారి నేరచరిత్ర పరిశీలన, వాహనాల పార్కింగ్ నిర్వహణ, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గుర్తింపు తదితర భద్రతా అంశాలపై సమగ్రంగా చర్చించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో పోలీస్, విజిలెన్స్ అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని గెస్ట్ హౌస్ నిర్వాహకులకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీస్ లేదా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. గెస్ట్ హౌస్‌ల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా పార్కింగ్‌ను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు, వీఐపీ/వీవీఐపీ అతిథుల భద్రతకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీస్, టీటీడీ విజిలెన్స్ , గెస్ట్ హౌస్ నిర్వాహకులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా , విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్, విజిలెన్స్ విభాగాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.