newsseals.com
News

త్రీ-టైర్ హెల్త్‌కేర్ సిస్టమ్ మ‌రింత మెరుగు ప‌డాలి

Posted by: VijayaBhaskar June 7, 2026
newsseals-ThreeTierHealthCareSystem

కీల‌క సూచ‌న‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్

అమ‌రావ‌తి : ఏపీ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధులు, జీవనశైలి వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆవేద‌న చెందారు. శారీరక శ్రమ లేక పోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ , చక్కెర పానీయాల వినియోగం, మానసిక ఒత్తిడి ఇందుకు ముఖ్య కారణాలు అని పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో 55 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు, భారతదేశంలో ఒక దశాబ్దం ముందే అంటే 45 ఏళ్ల వయస్సులోనే కనిపిస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని వాపోయారు గ‌వ‌ర్న‌ర్.

చురుకైన జీవనశైలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ,ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఈ జీవనశైలి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. భారతదేశంలో త్రీ-టైర్ హెల్త్‌కేర్ సిస్టమ్ ఉన్నప్పటికీ, పట్టణ , గ్రామీణ ప్రాంతాల మధ్య సేవల లభ్యతలో అసమానతలు ఉన్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు అబ్దుల్ న‌జీర్. పట్టణ ప్రాంతాలలో మెరుగైన వసతులు ఉండగా, గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని అన్నారు. ఈ ఆసుపత్రి శ్రీకాకుళం వంటి వెనుకబడిన ప్రాంతాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజల అవసరాలను తీరుస్తుండటం విశేషం అని కొనియాడారు.