అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు

న్యూఢిల్లీ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంచలన ప్రకటన చేసింది. ఈసందర్బంగా ఏపీకి తీపి కబురు చెప్పింది. అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటుకు NTPC ప్రణాళిక చేపట్టింది. ఈ సోలార్ పార్క్ నిర్మాణం ,నిర్వహణ దశల్లో గణనీయమైన ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు, ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు , ఆర్థిక కార్యకలాపాలను పెంపొందిస్తుందని భావిస్తున్నారు. స్వచ్ఛమైన ఇంధనం , సుస్థిర అభివృద్ధిని విస్తరించడంపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న దృష్టికి ఈ ప్రాజెక్ట్ అనుగుణంగా ఉందని మంత్రి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఒక భారీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ రాబోతోంది అని చెప్పారు.
NTPC రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కనేకల్, రాయదుర్గం , డి. హిరేహాల్ మండలాల్లో 1,200 మెగావాట్ల (1.2 గిగావాట్ల) భారీ సోలార్ పవర్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది అని తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కృషి ఫలితంగా సాకారం కానున్న ఈ ప్రాజెక్ట్, వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని అంచనా. ఈ సోలార్ పార్క్ గ్రిడ్‌కు స్వచ్ఛమైన విద్యుత్తును సరఫరా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం , పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరువు పీడిత రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ గొప్ప ఊతమిస్తుందని ఆయన తెలిపారు.