మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

VijayaBhaskar · February 3, 2026
Spread the love

మంత్రులు ఆనం, వంగ‌ల‌పూడి, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి

శ్రీ‌శైలం : మ‌హా శివ‌రాత్రి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని శ్రీ‌శైలంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి ఆదేశించారు. శ్రీ‌శైలంలో శివ రాత్రి సంద‌ర్బంగా కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ , శ్రీ‌శైలం బోర్డు చైర్మ‌న్ ర‌మేష్ నాయుడు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఎస్‌ఓపీని ఆధారంగా చేసుకొని అన్ని ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం అన్ని ఆలయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టింద‌న్నారు భక్తులకు సజావుగా, సంతృప్తికరంగా దైవ దర్శనం కల్పించినప్పుడే ప్రభుత్వ చర్యలు విజయవంతం అవుతాయ‌ని తెలిపారు.

వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు ప్రత్యేక స్లాట్లు కేటాయించి, నిర్ణయించిన సమయంలోనే దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. అటవీ సంరక్షణ పరిధిలో ఉన్న ఆలయ ప్రాంతంలో విస్తరణ సాధ్యం కాకపోయినా, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అడవి మార్గంలో 48 కిలోమీటర్లు నడక దారిలో వచ్చే శివ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అటవీ శాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి సమస్యలను అధిగమించాలని మంత్రి ఆదేశించారు.