శ్రీ‌కాళ‌హ‌స్తి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భ‌ద్ర‌తా ఏర్పాట్లు

VijayaBhaskar · February 10, 2026
Spread the love

వెల్ల‌డించిన తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు

తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, సౌకర్యాల నిర్వహణపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాళహస్తి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రద్దీ నియంత్రణ కోసం వాలంటీర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బందిని వినియోగించు కోవాలని స్ప‌ష్టం చేశారు.

ప్రధాన ఆలయాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంతో పాటు, సీసీ కెమెరాలు , డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. భక్తులకు అవసరమైన తాగునీరు, వైద్య సహాయం , ఇతర ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.