శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

VijayaBhaskar · February 25, 2026
Spread the love

భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్‌ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్, విద్యుత్, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు. తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరిస్తారని వివరించారు.

చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4వ రోజు ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పలపై ఉత్సవ మూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు. కాగా తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌లో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఈఈలు శ్రీనివాసరావు ,సుధాకర్, డిఈ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.