శ్రీ‌శైలంలో ఘ‌నంగా కుంభోత్స‌వం

VijayaBhaskar · April 7, 2026
Spread the love

అమ్మ వారికి నేత్ర శోభితంగా అలంకారం

శ్రీ‌శైలం : ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీ‌శైలం భ‌క్త బాంధ‌వుల‌తో కిట‌కిట లాడుతోంది. మంగ‌ళ‌వారం మ‌ల్ల‌న్న ఆల‌యంలో శ్రీ‌ భ్రమరాంబా దేవికి కుంభోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. అమ్మవారి ఆలయానికి నిమ్మకాయలతో నేత్ర శోభితంగా అలంకారం చేశారు. తెల్లవారు జామున అమ్మ వారికి ఏకాంతంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మ వారికి సాత్త్విక బలిగా గుమ్మడి, కొబ్బరికాయలు సమర్పణ, సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం చేసి ఆలయ ద్వారాలు మూసివేశారు. సాయంత్రం ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో అమ్మ వారికి కుంభ హారతి సమర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

కుంభహారతి తర్వాత అమ్మవారి మూలవిరాట్‌కు పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామ‌ని శ్రీ‌శైలం మ‌ల్ల‌న్న ఆల‌య ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ల‌వ‌న్న వెల్ల‌డించారు. నంద్యాల జిల్లాలో ఉన్న ఈ అరుదైన క్షేత్రం శివ భ‌క్తుల‌కు ప్రీతిపాత్ర‌మైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారాల్లో అమ్మ వారికి కుంభోత్సవం నిర్వహించడం జ‌రుగుతోంది.