newsseals.com

గోవింద నామ స్మరణతో వైభవంగా రథోత్సవం

July 3, 2026 · VijayaBhaskar

తిరుపతి : అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం భక్తి పారవశ్యంతో, వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామ సంకీర్తనల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారు రథారోహణం చేయగా, ఉదయం 8.45 గంటల నుండి 10.15 గంటల వరకు నాలుగు మాడవీధుల్లో దివ్య విహారం చేస్తూ వేలాది మంది భక్తులకు అభయప్రద దర్శనం ఇచ్చారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.

రథోత్సవం ఆత్మతత్త్వాన్ని బోధించే మహోన్నత ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. ఆత్మ రథికుడు, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులుగా భావించే ఈ ఉపమానం ద్వారా ఆత్మ–అనాత్మ వివేకాన్ని గ్రహించే అవకాశం కలుగుతుందని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. రథోత్సవం అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు శ్రీ స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీటితో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

Related News