సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రం
సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ కేంద్రం అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మందులు , సాఫ్ట్ జెల్స్‌ను తయారు చేస్తుంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర ఉన్నతాదికారులు హాజరయ్యారు. భారతదేశపు ‘ఫార్మా రాజధాని’గా అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణలో మరో భారీ ఔషధ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. సిద్దిపేట జిల్లా కరకపట్లలోని బయోటెక్ పార్క్-3లో, క్యాన్సర్ మందుల తయారీ సంస్థ అయిన ‘సిరో ఫార్మా’ (CIRO Pharma) నిర్మించిన అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు శ్రీధర్ బాబు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ తయారయ్యే క్యాన్సర్ మందులను ప్రధానంగా అమెరికా, ఐరోపా, లాటిన్ అమెరికా , గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 275 మంది సిబ్బంది పనిచేస్తుండగా, పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఉద్యోగులు , శాస్త్రవేత్తల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ఫార్మా పరిశ్రమలు పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు శ్రీధర్ బాబు.