కడప జిల్లా : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలేనని కొనియాడారు. ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నాపై కోడిగుడ్లతో దాడిచేసి, భయ పెట్టాలని చూశారు, జి.ఓ. నెం.1 పేరుతో పాదయాత్రను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కడప జిల్లా. మధ్యలో రెండు ఎన్నికల్లో ఇబ్బందిపడినా గత ఎన్నికల్లో మళ్లీ పార్టీకి గతవైభవం తెచ్చారు. అధికారంలోకి వచ్చామని కష్టకాలాన్ని మర్చి పోకూడదు. నేను పాదయాత్ర బుక్ చూసినపుడు ఆనాటి స్మృతులన్నీ గుర్తుకు వస్తుంటాయి. మినీ ముంబాయిగా పేరొందిన ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవల జొన్నగిరి గోల్డ్ మైన్ ను ప్రారంభించిన చంద్రబాబు రాయలసీమను గోల్డ్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రొద్దుటూరులో నాలుగుసార్లు టిడిపి గెలిచిందన్నారు లోకేష్..
2025 కడపలో జరిగిన మహానాడులో ఆరుశాసనాలను తీసుకున్నాం. అందులో ముఖ్యమైంది కార్యకర్తే అధినేత. దానిని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. కోటిమందికి పైగా కార్యకర్తలున్న అతిపెద్ద కుటుంబం మనది. ఇంత భారీ వ్యవస్థలో చిన్నచిన్న సమస్యలు సహజం. బూత్, క్లస్టర్, మండల, నియోజకవర్గ, పార్లమెంటు, జోనల్ స్థాయిల్లో సమస్యలను పరిష్కరించు కోవాలి. ఆ దశల్లో పరిష్కారం కాకపోతే కేంద్ర కార్యాలయం దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. కార్యకర్తల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత నాయకులందరిపైనా ఉంది. పార్టీలో సంస్కరణల కోసం నేను ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. సమస్యలను నాలుగుగోడల నడుమ బాబుగారితో చర్చిస్తాం. బయటకు వచ్చాక జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ముక్తకంఠంతో నినదించాలి.
సీనియర్ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పార్టీ కేడర్ అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ప్రతిపక్షంలో ఈ నియోజకవర్గంలో అనేకమంది నేతలు నాతో కలసి నడిచారు. వారందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది. పార్టీలో వర్గాలు ఉండకూడదు. వర్గాల వల్ల పార్టీ నష్టపోతుంది. నాయకులు పార్టీని నమ్మి పనిచేయండి, వారికి సరైన స్థానం కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. కష్టపడిన నాయకులను గుర్తించేందుకే మై టిడిపి యాప్ తెచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసే 4 లక్షలమంది నాయకుల పనితీరును అంచనా వేసేందుకు ఈ యాప్ ఉపయోగ పడుతుంది. ఏ కార్యక్రమం చేసినా మై టిడిపి యాప్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకురండి. పదవులు వాటంతట అవే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. నామినేటెడ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియను చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొలివిడతలో అవకాశం రానివారికి మలివిడతలో వస్తుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను గుర్తించే బాధ్యత నాది.





