ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ బాట పట్టిన సీఎం
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు.
అంతే కాకుండా కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 07.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి 10.00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం రేపు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస చేస్తారు. ఢిల్లీలో కార్యక్రమాలను ముగించుకుని గురువారం ఉదయం 10.20 గంటలకు తిరిగి రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది ఏపీ సర్కార్.