ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్ CURE (కోర్ అర్బన్ రెన్యూవల్ ఏరియా) పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇళ్లు’ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వివిధ శాఖలకు చెందిన నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించాలని ఆయన సూచించారు. ఇళ్ల నిర్మాణంపై మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్ , పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో క‌లిసి సమీక్ష చేశారు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన భూముల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలీస్, రెవెన్యూ , రవాణా శాఖలకు చెందిన నిరుపయోగ భూములను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించు కోవాలని, ఆయా శాఖలకు ప్రత్యామ్నాయ భూములను వేరే చోట కేటాయించాలని సీఎం ఆదేశించారు.

నివాస ప్రాంతాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పొందడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, అవి నిరుపయోగంగా మిగిలి పోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పని ప్రదేశాలకు దగ్గరగా, నివాస ప్రాంతాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల పేదలు తమ జీవనోపాధిని కోల్పోరని సీఎం పేర్కొన్నారు. CURE పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్ సుమారు 528 చదరపు అడుగుల ‘బిల్ట్-అప్ ఏరియా’ (నిర్మాణ విస్తీర్ణం) , 400 చదరపు అడుగుల ‘కార్పెట్ ఏరియా’ను కలిగి ఉంటుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ. 11 లక్షల ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన రూ. 6 లక్షలను లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుంది. భూమి ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

మొదటి దశలో, 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పుర, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ , మలక్‌పేట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలోని వినియోగంలో లేని ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

  • Related Posts

    మొబైల్ ఫోన్ల వినియోగంపై సింగరేణి నిషేధం

    క‌రీంన‌గ‌ర్ జిల్లా : సింగ‌రేణి బొగ్గు గ‌నుల సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బొగ్గు గనుల్లో ప‌ని చేసే కార్మికులు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించిన‌ట్లు వెల్ల‌డించింది. భద్రతా కారణాలు, పని ప్రదేశాల్లో కార్మికులు ‘రీల్స్’ (చిన్న వీడియోలు) చిత్రీకరించే…

    ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్రచారం చేప‌ట్టాలి

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్ర‌చార‌ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *