newsseals.com

నాగార్జునసాగర్‌లో సీఎం ‘వరుణ యాగం’

August 10, 2026 · VijayaBhaskar

న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలో వ‌ర్షాలు కురియాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వ‌రుణ యాగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. యాగం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి త‌న స‌తీమ‌ణితో క‌లిసి హాజ‌ర‌య్యారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో విలసిల్లాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వరుణయాగం నాగార్జునసాగర్‌ విజయ్‌విహార్‌ ప్రాంగణంలో సోమవారం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం జరుగుతోంది. కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

తెల్లవారుజామున 4:05 గంటలకు ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. గోపూజ, విశ్వక్సేన పూజ, యాగశాల ప్రవేశం వంటి కార్యక్రమాలు జరిగాయి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, నల్గొండ కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, దేవాదాయశాఖ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రం వర్షాలతో సస్యశ్యామలమై వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ వరుణ యాగం నిర్వహించ బడుతోంది.

Related News