అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలు మనం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం మొత్తం పోలీసు వ్యవస్థపైనే మరక పడుతుందని, అందుకే జాగ్రత్తగా విధులు నిర్వహంచాలన్నారు. సింగయ్య వాహనం కింద పడిపోయి చనిపోతే కూడా ఎదురు ఆరోపణలు చేశారు. జగన్ కారు కింద పడిపోయినట్టు గా వీడియో వచ్చింది. కారు తొక్కేస్తే పొదల్లో పడేశారు. ప్రాణాలు కాపాడబోయిన పోలీసులపైనే నెపం పడిందన్నారు. ఇబ్రహీంపట్నంలో రాజకీయ పార్టీ ర్యాలీలో రోడ్డుపై మోటారు సైకిల్ విన్యాసాలు ఏమిటి? పోలీసులపై కూడా దాడులు జరిగే పరిస్థితి ఉంది. ఏ పార్టీ అయినా రోడ్డుపై విన్యాసాలు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు సీఎం.
ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా వెళ్లటం అన్ని పార్టీల బాధ్యత అని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ నేతలు కాబట్టి ఫ్రీగా వదిలేస్తామంటే శాంతి భద్రతల పరిస్థితి వస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు ఇష్టానుసారం వ్యవహరించే లైసెన్సు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రోడ్లపై వీరంగం సృష్టిస్తున్న వారిలో 94 శాతం మంది ఒక పార్టీ నుంచే ఉంటున్నారని ఆయన జగన్ రెడ్డి పార్టీని ఉద్దేశించి అన్నారు. పరామర్శలకు వెళ్లటం తప్పేం కాదు. రోడ్లపై చేసే ప్రదర్శనల వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు. విశాఖపట్నంలో 3 గంటల పాటు రోడ్లను బ్లాక్ చేశారు. అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లే వారు, ఆఫీసుకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే సీఎంగా నేను కూడా వాహన కాన్వాయ్ కుదించుకున్నాను. మానసిక పరిస్థితి సరిగాలేని కొందరు వ్యక్తులు చేసే నేరాలపై ప్రజల్లోనూ చర్చ జరగాలి. కొందరు రౌడీలే సామాజిక మాధ్యమాల్లో హీరోలుగా మారుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.






