నాకెందుకు షోకాజ్ నోటీసులు ఇస్తారు..?
హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ, దర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగన్ రెడ్డిల దందాలు, అక్రమాలు, కబ్జాలు, లూటీలు, బెదిరింపులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఓరుగల్లు వేదికగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తానంటూ ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కొండా సుష్మిత.
ఇందుకు సంబంధించి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సురేఖతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి కి సైతం ఈ నోటీసులు ఇచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కొండా సురేఖ. ఈ వ్యవహారం వెనుక ఉండి సూత్రధారులుగా వ్యవహరిస్తున్న అసలు వ్యక్తులను నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మల్లు రవికి లేఖ రాశారు.
పార్టీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత , బలహీన వర్గాల ఆత్మగౌరవం వంటి విలువలకు కట్టుబడి పనిచేసే పార్టీ ఇది అని పేర్కొన్న మంత్రి సురేఖ, ఈ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.