వైభవంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ
దేవుని కడప : దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆగమోక్త వైదిక మంత్రోచ్ఛారణల నడుమ వాస్తుశాంతి, మృత్సం గ్రహణం, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 24న ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం, శాత్తుమొర, సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆగస్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం, సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర నిర్వహించనున్నారు. ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించి, ఉయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహా సంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎ. ప్రశాంతి, ఏఈవో రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.