జపాన్ : జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు ఉక్కు, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ–జపాన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు పడింది. హైదరాబాద్–మియోషి నగరాల మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను నైపుణ్యాభివృద్ధి, విద్య, సాంకేతికత, స్మార్ట్ వ్యవసాయం, యువత మార్పిడి, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల దిశగా విస్తరించాలని ప్రతిపాదించారు. జపాన్ పర్యటనలో భాగంగా మియోషి నగర మేయర్ ఫుకుయోకా సతోషిని మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణ–మియోషి మధ్య భవిష్యత్ సహకారంపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణలో ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగిన యువతను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ , అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు , ఐటీఐలు, ఇతర సాంకేతిక–వృత్తి విద్యా సంస్థల ద్వారా అంతర్జాతీయ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మియోషిలోని సాంకేతిక విద్యా సంస్థలు, తెలంగాణలోని వైఐఎస్ యు, ఏటీసీలు, ఐటీఐల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విద్యార్థులు, శిక్షకుల పరస్పర పర్యటనలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, జపాన్ తయారీ విధానాలు, పని ప్రదేశ ప్రమాణాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణపై ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కోరారు.
జపాన్లో ఉద్యోగాల కోసం తెలంగాణ యువతకు కేవలం సాంకేతిక శిక్షణ మాత్రమే కాకుండా జపనీస్ భాష, పని చేసే ప్రదేశంలో క్రమశిక్షణ, సామాజిక విలువలు, సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జపాన్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన తెలంగాణ యువతకు పారదర్శకమైన, క్రమబద్ధమైన ఉద్యోగ మార్గాలను అభివృద్ధి చేయడంలో టామ్ కామ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జపాన్ పరిశ్రమల మానవ వనరుల అవసరాలను తెలంగాణలోని నైపుణ్యం కలిగిన యువతతో అనుసంధానించేందుకు దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్మార్ట్ వ్యవసాయం రంగంలోనూ తెలంగాణ–జపాన్ మధ్య సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ సామర్థ్యాన్ని వివరిస్తూ.. వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
జపాన్లో అమలవుతున్న వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక ఆధారిత సాగు, ఉత్పాదకత పెంపు, సుస్థిర వ్యవసాయ విధానాలపై పరస్పర అవగాహన, సాంకేతిక సహకారం పెంచుకోవాలని సూచించారు. హైదరాబాద్–మియోషి మధ్య రెండు దశాబ్దాల స్నేహ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు. డిసెంబరులో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026లో పాల్గొనాలని మియోషి మేయర్ ఫుకుయోకా సతోషిని, నగర ప్రతినిధి బృందాన్ని మంత్రి ఆహ్వానించారు. ఈ పర్యటన సందర్భంగా విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మధ్య నిర్దిష్ట భాగస్వామ్యాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్–మియోషి మధ్య ఇప్పటికే ఉన్న స్నేహ సంబంధాలను ఆధారంగా చేసుకుని ఇకపై స్పష్టమైన ఫలితాలు సాధించే భాగస్వామ్యాలను రూపొందించడమే లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నైపుణ్యాలు, సాంకేతికత, వ్యవసాయం, విద్యార్థుల మార్పిడి, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలపై సహకారాన్ని పెంచుతూ నగరం–రాష్ట్ర స్థాయిలో భారత్–జపాన్ సంబంధాలకు కొత్త నమూనాను రూపొందించాలని పేర్కొన్నారు.






