భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక
విశాఖపట్నం జిల్లా : ‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి… రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవ వనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని అన్నారు.
1995లో సీఐఐ సదస్సులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగుతున్నాం. 2024లో జరిగిన సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. దాని ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా చేసుకున్నాం. ఇటీవల కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 15 ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు పెట్టేలా, 14 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో సైతం 150 ఎంఓయూలు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ప్రగతి బాట. భవిష్యత్తు తరాలకు పూలబాట. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ముందు ఉండటానికి స్థిరమైన ప్రభుత్వం, భవిష్యత్తుపై ఆశలు, ఆలోచనలే ప్రధానం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేం తగిన విధంగా ముందుకు వెళ్తాం అన్నారు.