newsseals.com

బ్లో అవుట్ ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఆరా

November 17, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక సమీపంలో మంగ‌ళ‌వారం ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి వద్ద చోటు చేసుకున్న బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ‌ తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడినట్లు కలెక్టర్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ నగరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపి వేసినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే ఓఎన్జీసీ సాంకేతిక బృందం బావి వద్దకు చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు, మరో ఐదు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కు వివ‌రించారు జిల్లా క‌లెక్ట‌ర్. ఇటీవల తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మ‌రో వైపు ఓఎన్జీసీ అధికారులు హుటా హుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గ్యాస్ లీకేజీ కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Related News