newsseals.com
News

మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు

Posted by: VijayaBhaskar November 25, 2026
newsseals-AnithaVaangalapddui

అమరావతి : కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 4వ తేదీన ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అయితే వారు ప్రయాణించిన బోటు ఆచూకీ లభించక పోవడంతో ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

వారి సహకారంతో సముద్రంలో గాలింపు చర్యలను విస్తృతం చేసింది. మత్స్యకారుల ఆచూకీ కనుగొనేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించు కోవాలని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల పురోగతిని హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటూ, మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.