సంక్షేమ నిధి కమిటీని వెంటనే నియమించాలి

విజయవాడ : చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీని తక్షణమే నియమించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ కి వినతిపత్రం సమర్పించింది.
సమాచార శాఖ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం APWJF ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడారు. ఇటీవల కాలంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల సమాచార శాఖ చురుకుగా స్పందించి పరిష్కార మార్గాల దిశగా అడుగులు వేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అదే సమయంల చాలాకాలంగా నియామకానికి నోచుకోని వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఆసరాగా నిలిచే నిధి ఉండాలన్నారు. ఈ సంక్షేమ నిధి జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరమైన అంశాల్లో అండగా నిలవడంతో పాటు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని ఈవిషయంలో సర్కార్ కూడా సానుకూలంగా ఆలోచించాలని అన్నారు. ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమర్పించడం జరిగిందన్నారు ఆంజనేయులు.