అక్రమ ఇసుక తవ్వకాలపై సీఎం సీరియస్

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని పెన్నా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల తాగునీటి పైప్‌లైన్ దెబ్బతిన్న ఘటనపై స్పందించారు. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలించి, వెంటనే పూర్తి వివరణ ఇవ్వాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు, ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినా లేదా అక్రమ తవ్వకాలకు పాల్పడినా, ఎవరినీ వదిలిపెట్టవద్దని జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లి సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించగానే, స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు సమాచారం అందించారని కలెక్టర్ తెలిపారు.
అధికారులు వెంటనే రంగంలోకి దిగి అక్రమ తవ్వకాలను, ఇసుక రవాణాను పూర్తిగా నిలిపి వేశారని అన్నారు. ,అక్రమ రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్లు, వాటి యజమానులు , ఈ ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్న వ్యక్తుల వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశామని కలెక్టర్ సీఎంకు తెలిపారు. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని కలెక్టర్ వెల్లడించారు. తాగునీటి పైప్‌లైన్‌ను ధ్వంసం చేసిన నిందితులు , ట్రాక్టర్ యజమానులపై కఠినమైన చట్టపరమైన నిబంధనల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. దెబ్బతిన్న పైప్‌లైన్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు.